AP EAPCET 2025: ఇంటర్ మార్కుల అప్‌లోడ్‌కు రేపటివరకు మాత్రమే అవకాశం
ఆంధ్రప్రదేశ్ EAPCET-2025 ఫలితాలు విడుదలైనప్పటి నుంచి కొన్ని కీలక కారణాలతో విద్యార్థులకు ర్యాంకులు లభించలేదు. ముఖ్యంగా, ఇంటర్మీడియట్ (10+2) మార్కులు అందుబాటులో లేనివారు సుమారు 15,000 మంది ఉన్నట్లు కన్వీనర్ వీపీ సుబ్బారావు తెలిపారు.
ఇప్పటివరకు కేవలం 3,900 మంది మాత్రమే తమ మార్కులు అప్‌లోడ్ చేసినట్లు సమాచారం. విద్యార్థులు ర్యాంక్ పొందేందుకు ఇంటర్ మార్కుల అప్‌లోడ్ అవసరమని స్పష్టం చేశారు.
ఇంకా కొన్ని సందర్భాల్లో విద్యార్థులు దరఖాస్తు సమయంలో ఇంటర్ హాల్ టికెట్ నంబరును తప్పుగా నమోదు చేశారు. ఇటువంటి వారిలో 697 మంది సవరించేందుకు దరఖాస్తు చేశారు. ఈ సమస్యలు పరిష్కరించుకునే గడువు జూన్ 15, 2025 వరకే అని ఆయన తెలిపారు.
వివిధ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో, ఈ అవకాశాన్ని వదులుకోవద్దని విద్యార్థులకు సూచించారు.
