డ్రోన్ కెమెరాలో గంజాయి పీలుస్తూ పట్టుబడ్డ నలుగురు యువకులు – తిరుపతిలో పోలీసులు నిఘా
తిరుచానూరులో గంజాయి స్థావరంపై డ్రోన్ నిఘా
తిరుపతి జిల్లాలో గంజాయి వాడకం పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు నిఘా చర్యలు కట్టుదిట్టం చేశారు. ఈ చర్యలలో భాగంగా తిరుచానూరు – తిరుపతి ప్రధాన రహదారి వెంబడి ఉన్న పాత భవనంలో గంజాయి పీలుస్తున్న నలుగురు యువకులు డ్రోన్ కెమెరాలో చిక్కారు.
జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఈ ప్రాంతంలో గంజాయి మాఫియాపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు డ్రోన్‌ల ద్వారా ఆప్రాంతాన్ని స్కాన్ చేస్తున్నారు. ఇటీవల అనుమానాస్పద కార్యకలాపాలు నమోదవుతున్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేకంగా పాత భవనాలపై దృష్టిసారించారు.
డ్రోన్ కెమెరా కీలక ఆధారం
పోలీసులు హైవేపై గస్తీ నిర్వహిస్తున్న సమయంలో పాత భవనం మీద నుంచి పొగలు రావడం గమనించారు. డ్రోన్ కెమెరా ద్వారా ఆ ప్రాంతాన్ని పరిశీలించగా నలుగురు యువకులు గంజాయి వాడుతున్న దృశ్యాలు ప్రత్యక్షంగా రికార్డయ్యాయి.
దీనిపై స్పందించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని తిరుచానూరు పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.
నిఘా ఇంకా కొనసాగుతుంది
పట్టుబడ్డ యువకుల ద్వారా మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారు గంజాయి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారన్న దానిపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, న్యాయ ప్రక్రియ చేపట్టనున్నారు.
తిరుపతి ప్రాంతంలో యువత గంజాయి వాడకంపై పోలీసులు అప్రమత్తమవుతున్నారు. నిఘా కోసం డ్రోన్ టెక్నాలజీని వినియోగించడం ఈ కేసులో సఫలమైంది.
జనతా కూడా గంజాయి వంటి మత్తు పదార్థాల దూరంగా ఉండాలని, ఎవరైనా ఇటువంటి కార్యకలాపాల్లో కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.