మామిడి రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్ డా. వెంకటేశ్వర్
Spread the love

మామిడి రైతులకు ఊరట: చివరి కిలో వరకు రూ.4 రాయితీ

రైతులకు ఆందోళన అవసరం లేదు – కలెక్టర్ హామీ

తిరుపతి కలెక్టరేట్, జూన్ 18: జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న మార్కెట్ ఇబ్బందులను తగ్గించేందుకు ప్రభుత్వం పెద్ద చర్యలు చేపట్టింది. మామిడి దిగుబడులకు గిరాకీ తక్కువగా ఉండటం, ఎగుమతులు మందగించడం వంటి సమస్యల నేపథ్యంలో, ప్రతి కిలో మామిడికి రూ.4 రాయితీని చెల్లించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ తెలిపారు.

ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఎగుమతులపై

కలెక్టర్ మాట్లాడుతూ, ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో మామిడి ఎగుమతులు గణనీయంగా తగ్గినట్లు తెలిపారు. దీని ప్రభావం దక్షిణ భారతదేశంలోని అనేక జిల్లాలపై పడినట్లు తెలిపారు. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో పండిన మామిడికి సరైన ధరలు లభించకపోవడంతో రైతులు ఆందోళనకు లోనవుతున్నారని ఆయన గుర్తించారు.

రైతుల ప్రయోజనాల కోసం పరిశీలన

కలెక్టర్ డా. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా ఉద్యాన శాఖాధికారి దశరథరామిరెడ్డిలతో కలిసి కేబీవీపురం, నారాయణవనం, రేణిగుంట మండలాల్లోని దేవరాజ్ ఆగ్రో ఫుడ్స్ టాస్క్, వర్ధన్ ఫుడ్స్ సంస్థల మామిడి ప్రాసెసింగ్ కేంద్రాలను సందర్శించారు. ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్ స్థితిగతులను అక్కడ పరిశీలించారు.

ప్రత్యక్షంగా రైతుల సమస్యలు పరిశీలన

ఈ సందర్శనలో అధికారుల బృందం రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రైతులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, ముందుగా తమ పంటను వ్యర్థంగా మారిస్తామనే భయాన్ని ప్రభుత్వం తొలగించిందన్నారు. రాయితీ ప్రకటన ద్వారా చివరి కిలో మామిడి వరకు నష్టపోకుండా అమ్ముకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినట్లు అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మామిడి మార్కెటింగ్‌కు సహకారం

ఈ చర్యలతో పంట మార్కెటింగ్‌లో కొత్త ఉత్సాహం మొదలయ్యే అవకాశం ఉంది. రైతులు తక్కువ ధరకు అమ్మాల్సిన పరిస్థితి తప్పించుకోగలరని ఆశలు వ్యక్తం చేస్తున్నారు.

 

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *