నెయ్యి మన వంటకాలలో ప్రాధాన్యంగా వాడే హెల్దీ ఫ్యాట్. ఇది శరీరానికి శక్తినిచ్చే, జీర్ణవ్యవస్థకు తోడ్పడే, ఎముకలను బలపరచే పోషకాలను కలిగి ఉంటుంది. అలాగే చపాతీలు కూడా డైట్‌లో భాగంగా బరువు తగ్గే వారిలో విశేష ప్రాముఖ్యత పొందాయి. అయితే ఈ రెండింటిని కలిపి తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా అవసరం.
చాలామంది చపాతీ లేదా రోటీ వేడిగా ఉన్నప్పుడు, వాటిపై కాస్త నెయ్యి రాసుకుని తింటుంటారు. కొందరైతే కాస్త పంచదార చల్లి తియ్యగా కూడా తింటారు. అయితే ఆచార్య బాలకృష్ణ గారి ప్రకారం ఇది ఆరోగ్యపరంగా సరికాదు. ఆయన యూట్యూబ్‌లో షేర్ చేసిన వీడియో ప్రకారం, నెయ్యిని మరియు చపాతీని కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు ఏర్పడతాయంటున్నారు.
నెయ్యి స్వతహాగా మంచి గుణాలున్న పదార్థం. చపాతీలు కూడా లైట్ అండ్ హెల్దీ ఆహారం. కానీ వాటి రెండింటిని కలిపి తినడం వల్ల చపాతీ మీద నెయ్యి ఒక పొరలా ఏర్పడుతుంది. ఇది జీర్ణ ప్రక్రియలో ఆటంకం కలిగిస్తుంది. ఈ పొర ఆహారాన్ని పూర్తిగా జీర్ణం కాకుండా చేస్తుంది. దీని వల్ల అజీర్ణం, గ్యాస్, బరువుగా అనిపించడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
అయితే మీరు నెయ్యిని వాడాలనుకుంటే, చపాతీపై రాసి తినే బదులు పప్పు, కూరల్లో వేసుకుని తినడం ఉత్తమం. ఇలా చేస్తే రుచి తగ్గకుండా ఆరోగ్యపరంగా మేలు కలుగుతుంది. అదీగాక, మీరు రోటీలు మెత్తగా చేయాలనుకుంటే, పిండిలోనే ముందే నెయ్యి కలపడం ఉత్తమ మార్గం. ఇది రోటీలను మెత్తగా ఉంచడమే కాక, తేలికగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
గమనిక: ఇది సాధారణ ఆరోగ్య సమాచారం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలకైనా వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.