తిరుమల భక్తులకు ఉచిత ఆర్టీసీ బస్సుల ట్రయల్ రన్ ప్రారంభం
తిరుమలకు వచ్చే భక్తులకు ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు టీటీడీ-ఆర్టీసీ సంయుక్తంగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయి. టీటీడీ ఈవో ష్యామలరావు సూచన మేరకు, తిరుమల ఆర్టీసీ డిపో మేనేజర్ విశ్వనాథం నేతృత్వంలో ఉచిత బస్సు ట్రయల్ రన్ నిర్వహించారు.
గురువారం నుంచి తిరుపతి ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుమల వెళ్లే 10 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు, భక్తులను బస్టాండ్ వద్ద దింపిన తర్వాత టీటీడీ ఉచిత దర్శన బస్సులు తిరిగే మార్గంలో ఓ ట్రిప్ నడిపాయి. ఈ విధంగా భక్తులను ఆయా ప్రాంతాలకు చేరవేస్తూ, తిరిగి ఆర్టీసీ బస్టాండ్‌కు తీసుకెళ్లి తిరుపతికి బయలుదేరుతున్నాయి.
ఈ ట్రయల్ రన్ విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని ఉచిత బస్సులు అందుబాటులోకి తేవాలని టీటీడీ భావిస్తోంది. ఈ చర్య వల్ల భక్తుల రద్దీ సమయంలో ట్రాఫిక్ దద్దరిల్లకుండా, వినూత్న సేవలందించేందుకు అవకాశం ఏర్పడనుంది.
